సినీ హీరో విజయ్ దేవరకొండ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది. విజయ్ క్షమాపణలు చెప్పినా, ఈ వివాదం ఇంకా చర్చనీయాంశంగా మారింది.
గత ఏప్రిల్‌లో జరిగిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న విజయ్, పాకిస్థాన్ ఉగ్రదాడుల సందర్భంలో కొన్ని వేల ఏళ్ల క్రితం ఆటవిక తెగలు ఎలా ఘర్షణకు దిగాయో, ప్రస్తుతం పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని సూచించేలా వ్యాఖ్యానించారు. ఈ మాటలు గిరిజన సమాజం ఆగ్రహానికి గురయ్యాయి. తమను ఉగ్రవాదులతో పోల్చారని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. పోలీసులు పలు ఫిర్యాదులు కూడా స్వీకరించారు.
వివాదం పెద్దదవడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘నా మాటల వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధ కలిగింది. నేను ఎప్పుడూ ఏ వర్గాన్ని లేదా తెగను కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. మనం భారతీయులం అన్న భావనతోనే మాటలంటా. ‘ట్రైబ్’ అనే పదాన్ని వేరే అర్థంలో చెప్పాను. దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరి మనసునైనా నొప్పించినట్లయితే క్షమించండి. నేను శాంతి, ఐక్యతను మాత్రమే ప్రసారం చేయాలనుకుంటున్నాను” అని క్షమాపణ తెలిపారు.