ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరు? అని అడిగితే చాలామంది సచిన్ తెందూల్కర్, ముత్తయ్య మురళీధరన్, వివి రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేర్లు చెబుతారు. లేకపోతే తమ దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప ఆటగాళ్లను అత్యుత్తమ క్రికెటర్‌గా భావిస్తారు. కానీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) పైన పేర్కొన్న వారెవరి పేర్లను బెస్ట్ ప్లేయర్‌గా పరిగణించలేదు. అలా అని ఆసీస్ మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్, డాన్ బ్రాడ్‌మన్ పేర్లు చెప్పలేదు. ఇంతకీ పాంటింగ్ ఎవరి పేరు చెప్పాడో తెలుసా దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ (Jacques Kallis).
‘జాక్వెస్ కలిస్ అత్యుత్తమ క్రికెటర్. మిగతా వారందరి సంగతి నాకు తెలియదు. నా వరకు అతనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ క్రికెటర్. టెస్టుల్లో 13,000 పరుగులు, 45 సెంచరీలు, 300 వికెట్లు. మిగతా వారు తమ కెరీర్‌లో బ్యాటింగ్‌లో లేదా బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలను కలిగి ఉండవచ్చు. కలిస్ మాత్రం ఈ రెండింటిని కలిగి ఉన్నాడు. స్లిప్స్‌లో అతను అసాధారణ ఫీల్డర్. అతనికి తగినంత గుర్తింపు దక్కలేదు. ఎందుకంటే కలిస్ ఎక్కువగా మాట్లాడడు. అది అతని వ్యక్తిత్వం. అతడిని మీడియా ఎప్పుడూ హైలైట్ చేయలేదు’ అని పాంటింగ్ వివరించాడు.
కలిస్ తన 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో టెస్టులు, వన్డేల్లో ఎన్నో రికార్డులు సాధించాడు. 166 టెస్టులు ఆడిన ఈ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ 13,289 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్‌ది మూడో స్థానం. సచిన్ (15,921 పరుగులు), పాంటింగ్ (13,378 పరుగులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లోనూ కలిస్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 328 మ్యాచ్‌ల్లో ఆడి 11,579 రన్స్ సాధించాడు.519 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 338 క్యాచ్‌లు అందుకున్నాడు