ఈ మార్పలుకులో ఎక్కువగా తిట్టుపదాల అర్థాలు ఉన్నాయి, చాలా తిట్టుపదాల వెనుక మంచి అర్ధం ఉన్నా, వాటి వాడకం వల్ల తప్పుడు అర్థాలకు దారి తీశాయి, వాటి అన్నిటిని వివరించడం నా ఉద్దేశ్యం.
౧.బేవర్సు
ఇది. ” బే” , “వారిస్” అనే రెండు పదాలు కలిపి ఏర్పడిన పదం. వారిస్ అనేది అరబిక్ లో వారసుడు అన్న అర్థం ఉంది, బే అనేది పర్షియన్ లో “లేని , లేమి, కాని” వంటి అర్థాలలో వాడతారు. అంటే “బే- వారీస్” అంటే పిల్లలు లేని వాడు అని అర్థం. ఈ పదం పెర్షియన్ ద్వారా ఉర్డులోకి వచ్చి చివరకు తెలుగులోకి చేరింది.
దాని అసలు ఈ అర్థానికి, నేడు వాడుతున్న దానికి సంబంధం లేదు కదా???!
పిల్లలు లేని వారికి కుటుంబ బాధ్యతలు ఉండవు, ఇటువంటి బదరబందీ లేనివాడు తనకి నచ్చినవి చెయ్యవచ్చు, నచ్చిన చోటకు వెళ్ళవచ్చు, ఆ విధంగా “బే- వారీస్” అనే పదం “బేవర్స్” గా మారి ఈ అర్థం సంతరించుకుంది.
౨. పోరంబోకు.
ఏ ప్రయోజనం లేకుండా , నిరుపయోగంగా ఊరి బయట పడియున్న ఖాళీ స్థలాలకు ద్రవిడ భాషల్లో “పోరంబొక్కు” అన్న పదం ఉన్నది .
కానీ జనాల నోటిలో నాని పోరంబోకు అంటే పనీపాట లేని వాడు అన్న అర్థం ప్రస్తుతం తెలుగులో ప్రాచుర్యం పొందినది.
౩. బూచి
దీనికి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి
- మనకు స్వాతంత్య్రం రాక మునుపు, నాటి మద్రాసు రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని పాలించెడి ఒకానొక వైశ్రాయ్. పేరు “చార్లెస్ జోసెఫ్ బ్రుసీ” అతని కఠినత్వం వలన ప్రజలు ఆయనను ఒక రాక్షసుడిలా చూసేవారు, అలా బ్రూసి అనే పేరు రాక్షసుడికి మారు మాట గా మారింది. అలా వాడుక లో బ్రుసి కాస్త బూచీగా మారింది
- బొబ్బిలి రాజ్యానికి, విజయనగర రాజ్యానికి జరిగిన బొబ్బిలి యుద్ధం లో విజయనగరం తరపు సేనలో పాల్గొన్న ఫ్రెంచి వారైన నాటి బందరు గవర్నర్ బుస్సీ పేరు కాలక్రమేణా బూచి గా మారింది.
౪. బద్మాష్
దీని వాడకం తెలుగులో కాస్త తక్కువే.
దీనికి కూడా బెవర్స్ వంటి చరిత్ర ఉంది.
బద్ అంటే పర్షియన్ భాషలో చెడ్డ ,కుటిల అన్న అర్థం,
మాష్ అంటే అరబిక్ లో జీవితం, బతుకు అని అర్థం.
అనగా బద్మాష్ అంటే ” కుటిలమైన బ్రతుకు బతికే వాడు” ,”కుటిలుడు” అన్నట్టు.
౫. గూబ పగులుట
గూబ అంటే తెలుగులో కర్ణభేరి
“గూబ పగలగొట్టుట” అంటే చెవిలోని కర్ణభేరి పగులునంత గట్టిగా నీ చెంపపై కొడతా అని అర్థం.
కానీ చాలా మంది గూబను చెంపకు పర్యాయి పదంగా వాడుతున్నారు ఇది సరికాదు, కాబట్టి “గూబ మీద కొడతా”, “నీ గూబ చూపించు” అనే పదబంధాలు సరి అయినవి కావు.
౬. నీ అమ్మ కడుపు మాడ,
ఒక విధంగా చెప్పాలంటే , ఈ తిట్టులో తల్లి ని దూషించుట ఎంత మాత్రమూ లేదు.
ఇదే వాక్యాన్ని ఇంకో విధంగా చెబుతాను – “నీ తల్లికి గర్భశోకం కలుగుగాక”
అవును,. ఇక్కడ కడుపు మాడటం లేదా కాలటం అంటే గర్భశోకమే , అంటే ఈ తిట్టు వెనుక అర్ధం “నీకు చావు మూడాలి” అన్నట్టు
౭. “నీ దుంప తెగ
దీని యొక్క అర్థం కూడా పైదాని వంటిదే,
దుంప(వేరు) అనేది మొక్క యొక్క ముఖ్య భాగం , అది తెగితే మొక్క చచ్చిపోతుంది, కాబట్టి దీని అర్థం కూడా “నీకు చావు మూడాలీ” అనే.
౮. తస్స దియ్య
ఇది “తచ్చ – తియ్య ” అన్న పదబంధం నుండి ఏర్పడింది, తచ్చ అంటే అబద్ధం, బూటకం, దొంగ నాటకం లాంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి “వాడి తచ్చ – తియ్య” అంటే “వాడి బండారం బయట పెట్ట” అనట్టుగా భావించవచ్చు.
(పై రెండింటిని ప్రస్తుతం వాటి అర్ధాలకు కాక, ఇతర సందర్భాలలో వాడుచున్నారు, కాబట్టి వాటిని తిట్టు పదాలగా అనుకొనక్కరలేదు.)
౯. అప్రాచుడా
దీనికి మనం రెండు విధాలుగా అర్ధం చెప్పుకోవచ్చు
- అప్రాచ్యుడు : ప్రచ్యముకు (తూర్పునకు) చెందని వాడు , అంటే పశ్చిమ దేశాలకు చెందిన వాడు, అనగా పాశ్చాత్య వ్యామోహాలకు లోనై, మన సంస్కృతి నీ విస్మరించిన వాడు .
- అప్రాశ్యుడు: సహ పంక్తి లో భోజనం చేయకూడని వాడు, అంటే తక్కువ జాతి వాడు అన్న అర్థం వస్తున్నట్టు ఉంది.
అయితే ఈ రెండు అర్థాలలో ఏది సరియైనదో స్పష్టంగా తెలియదు
ఇవండి మనం అర్థాలు ఎఱుగక వాడుతున్న కొన్ని తెలుగు పదాలు . మీకు నచ్చింది అనుకుంటున్నాను
ఏమైన తప్పుగా వ్రాసి ఉంటే దయతో నా దృష్టికి తీసుకురాగలరు.
(ఇది Whatsapp సేకరణ )